Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఏసీబీకి గట్టి ఎదురుదెబ్బ... రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ ఏసీబీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేవలం ఒక్క రోజే జైల్లో ఉండి మరుసటి రోజే బెయిల్ పొందితే, అప్పుడు పిటిషన్ ను పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు... రేవంత్ రెడ్డి 30 రోజులు జైల్లో ఉన్నారన్న సంగతిని గుర్తు చేసింది. రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశారన్న సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని ఏసీబీ తరపు లాయర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీఆర్ పీసీ సెక్షన్ 164 ప్రకారం రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని గుర్తు చేసిన న్యాయస్థానం... ఇప్పుడు మళ్లీ కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో, బెయిల్ పొందడానికి రేవంత్ రెడ్డి అర్హుడే అని కోర్టు తేల్చి చెప్పింది. ఏసీబీ తరపున ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదించగా... రేవంత్ తరపున ఫేమస్ లాయర్ రామ్ జెఠ్మలానీ వాదించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ వాదించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ఆయన వాదనతో ఏకీభవించలేదు.

More Telugu News